ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన బఫెలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వేణు గోవిందరాజు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
లక్షల సంవత్సరాల పరిణామ ప్రక్రియల ద్వారా రూపొందించబడిన లక్షణం, సందర్భాన్ని బట్టి క్రియాశీలంగా వ్యవహరించే ప్రత్యేక సామర్థ్యాన్ని మానవులు కలిగి ఉన్నారని, దీనికి విరుద్ధంగా డేటాసెట్ లపై కృత్రిమ మేథ ఆధారపడి అనుకరించే సామర్థ్యానికి పరిమితమవుతోందని అమెరికాలోని బఫెలో విశ్వవిద్యాలయ పరిశోధన, ఆర్థికాభివృద్ధి విశిష్ట ఆచార్యుడు డాక్టర్ వేణు గోవిందరాజు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ వికాసం: మానవ భాషా కమ్యూనికేషన్ పై దృక్కోణం’ అనే అంశంపై బుధవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. చెక్ లిస్టులు, పరీక్షలు, పరిశీలనలతో కృత్రిమ మేథ మనకు సాయపడుతున్నప్పుడు, మానవ ఆలోచన యొక్క సంక్లిష్టతను ప్రతిబింబించడంలో సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.కృత్రిమ మేథ రంగంలో నిపుణుడైన ఆయన, ముఖ్యంగా మానవ భాషా కమ్యూనికేషన్ రంగంలో తన లోతైన అవగాహనను అందించారు.
చేతి వ్రాత గుర్తింపులో డాక్టర్ వేణు మార్గదర్శక పని, అమెరికా పోస్టల్ సర్వీస్ ఉపయోగించే మొదటి చేతివ్రాత చిరునామా వివరణ వ్యవస్థ అభివృద్ధికి దారితీసింది. దాదాపు వంద మిలియన్ డాలర్ల ప్రాయోజిత ప్రాజెక్టులకు ఆయన నాయకత్వం వహించడంతో పాటు ఆరు పేటెంట్లు, 460 పరిశోధక పత్రాలను ప్రచురించి, పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.భాషా సంభాషణను ప్రసంగం, రచన, సంజ్జలు అనే మూడు ప్రాథమిక విభాగాలుగా డాక్టర్ వేణు విభజించారు. పది భావోద్వేగ స్థితులైన ఏకాగ్రత, గందరగోళం, ధ్యానం, నిరాశ, బాధ, సందేహం, ఆసక్తి, సాక్షాత్కారం, విశ్వాసం, విసుగు వంటివి అభ్యాస ప్రక్రియలో ఉంటాయన్నారు. మేధస్సు యొక్క సాంప్రదాయ నిరాశావాద దృక్కోణాలను సవాలు చేస్తూ, విభిన్న భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల నుంచి ఉత్పన్నమయ్యే ఒక ఉద్భవిస్తున్న దృగ్విషయంగా ప్రదర్శించారు.
సంక్లిష్ట లక్ష్యాలను సాధించడానికి వివిధ ఏజెంట్ల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ, తెలివితేటలు ద్రవం వలె ఆయా పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు. మేధస్సు అనేది సహజంగానే సామాజికమైనది, పరస్పరం ఆధారపడి ఉంటుందని స్పష్టీకరించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి అతిథిని స్వాగతించగా, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సత్కరించారు. ఈ ఆతిథ్య ఉపన్యాసం తరువాత డాక్టర్ వేణు గీతంలోని డైరెక్టర్లు, విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు. ఆ తరువాత సైబర్ ఫోరెన్సిక్, నెట్ వర్క్స్ ప్రయోగశాలలు, జీ-ఎలక్ట్రా, టీఈపీఈ, ఏరోమోడలింగ్ ల్యాబ్ లను సందర్శించడమే గాక, ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ లను కూడా పరిశీలించారు.