మనవార్తలు , అమీన్ పూర్:
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమీన్ పూర్, బొల్లారం లు సంబంధించిన అధికారులతో వర్షాల స్థితిగతులపై ఆరా తీశారు. చెరువులు, కుంటలు పొంగే చోట అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, మట్టిగోడల ఇళ్ల ను గుర్తించి వాటిలో నివసిస్తున్న వారిని సురక్షితప్రాంతాలకు చేరవేయాలని సూచించారు. అనంతరం శంతన్ గ్రీన్ హోం ను పరిశీలించి వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలోఅమీన్ పూర్ మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల పాండురంగా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహశీల్దార్ విజయ్ కుమార్, బొల్లారం తహశీల్దార్ దశరథ్, కమిషనర్ రాజేంద్ర కుమార్, డీఈ, ఏఈలు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు, పాల్గొన్నారు.