అమీన్పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం తో పాటు, సరిపడ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డు లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు, పి ఎన్ ఆర్ కాలనీలో నిర్మించిన వైకుంఠధామాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నరేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.