గీతంలో విజయవంతంగా ముగిసిన సాంస్కృతిక కోలాహలం

Telangana

_మూడు రోజుల నృత్య. సంగీత ప్రదర్శనలకు విశేష ఆదరణ

_చప్పట్లతో మార్మోగిన సభా ప్రాంగణం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మూడు రోజుల పాటు (డిసెంబర్ 18 నుంచి 20 వరకు) సాగిన సాంస్కృతిక కోలాహలం అసాధారణ కళాకారులు, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన ప్రేక్షకులను ఒకచోట చేర్చింది. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని లలిత, ప్రదర్శన కళల (ఫైన్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం ఆహూతులను విస్మయగొల్పడమే కాకుండా, కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగిపోయేలా చేసింది. మరో లోకంలోకి వెళ్లొచ్చిన అద్వితీయ అనుభూతి కలిగిందని, చెప్పడానికి మాటలు రావడం లేదనే వీక్షకుల స్పందనే, ఈ కార్యక్రమం విజయవంతానికి నిదర్శనం.

ప్రముఖ గాయని శివాని మనోహరమైన కర్ణాటక సంగీత కచేరీతో శ్రీకారం చుట్టుకున్న ఈ ఉత్సవం, చంద్రకాంత్ మృదంగం, వాసు వయోలిన్ సహకారం మరింత జనాదరణకు దోహదపడింది. శాస్త్రీయ కృతిల యొక్క ఆహ్లాదకరమైన సమ్మేళనం ప్రేక్షకులను ఆకర్షించింది. శివాని శ్రావ్య స్వరం ప్రేక్షకుల మదిని దోచి, ఉత్సవ స్థాయిని పెంచింది. ఆ తరువాత, అక్షయ జనార్ధన్ భరతనాట్య ప్రదర్శన ఉర్రూతలూగించింది. అలరిప్పు, తోడి పదవర్ణం, సఖి హే అష్టపదిలో తన మనోహరమైన ప్రదర్శనతో అక్షయ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ ప్రారంభించారు.

ఇక రెండవ రోజు ప్రదర్శనలు ఆహూతుల హృదయాలను రసడోలికల్లో ముంచెత్తి, ఓ అనిర్వచనీయమైన అనుభూతికి లోనుచేశాయి. డాక్టర్ మైథిలి సుశీల్ మరాట్ మోహినియాట్టంలోని ఘట్టాలైన యమునాష్టకం, హరివరాసనం, హిందీ గజల్ ప్రేక్షకులను భావోద్వేగానికి లోనుచేసి, మంత్రముగ్ధులను చేశాయి. దీని తరువాత, సరస్వతీ స్తుతి, తరంగం, హారతితో కూడిన డాక్టర్ వై. లలిత సింధూరి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఆమె డైనమిక్ వ్యక్తీకరణలు, శక్తివంతమైన ఫుట్ వర్క్ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసి, కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

వీటన్నింటికీ తలమానికంగా నిలిచిన, డాక్టర్ అన్వేష మహంత మరుపురాని సత్త్రియ ప్రదర్శనతో ఈ మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. డాక్టర్ మహంత తన నాటకీయ కథనం, నృత్య, అభినయ సమ్మేళనంతో సత్యభామ, కృష్ణుని కథలను విశేషమైన గాంభీర్యంతో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనిని తిలకించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, కళాకారుడి ప్రమేయం తనను ఎంతగానో కదిలించిందని, ఆ ప్రదర్శన తనను మరో ప్రపంచానికి తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు.

ఈ ఉత్సవాన్ని లలిత, ప్రదర్శన కళల విభాగం సమన్వయకర్త డాక్టర్ వై.లలిత సింధూరి ఆలోచనాత్మకంగా నిర్వహించారు. దీనికి అదే విభాగం అధ్యాపకులు వైష్ణవి, డాక్టర్ మైథిలి, అంజు అరవింద్ సహకారం అందించారు.గీతం ఫెస్టివల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మనదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడమే గాక, ఇలాంటి మరో కార్యక్రమం కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *