_దశాబ్ది ఉత్సవాల సంబరాలు అదిరిపోవాలి..
_ప్రతి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించండి..
_ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో కార్యక్రమాలు..
_నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి సూచించారు.మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలపై నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను పల్లె పల్లెనా ప్రతి ఒక్కరికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించాలని కోరారు.
తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో లక్ష రూపాయల నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే వారమని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టడం తెలంగాణ ప్రగతికి సూచిక అన్నారు. 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. నాడు కాలుష్యానికి చిరునామాగా పిలిచే పటాన్చెరును నేడు గేటెడ్ కమ్యూనిటీలకు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అపరిస్కృతంగా ఉన్న ప్రతి సమస్యపై చర్చించి వాటి పరిష్కారానికి నిధులు వెచ్చించామని తెలిపారు.గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా 24 అంతర్గత బ్రిడ్జిలు నిర్మించి మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడైన పటాన్చెరు గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి మూలంగా పరిశ్రమలు వారానికి మూడు రోజులు ఉత్పత్తి నిలిపివేసుకొని పని చేయాల్సిన పరిస్థితులు ఉండేవని, నేడు సీఎం కేసీఆర్ కృషి మూలంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందించడంతో లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా కార్మికుల కోసమే 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అతి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, కార్పోరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించడం మూలంగా విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం మంత్రుల సిఫార్సు లేఖలు తీసుకువెళ్లడం ప్రభుత్వ విద్యా రంగ సంస్థల పనితీరుకు అద్దం పడుతుందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కేజీ నుండి పీజీ వరకు సొంత భవనాల్లో ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.
పదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివిధ మాధ్యమాలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. 20 రోజులపాటు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.