సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం….
నల్గొండ జిల్లా…
TRS : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నాగార్జున సాగర్ లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతైంది.
మొదటి తొమ్మిది రౌండ్లలో భగత్ కు లీడ్ రాగా..
పదో రౌండ్ లో మాత్రం జానా రెడ్డికి స్వల్ప ఆధిక్యం వచ్చింది. 11,12,13 రౌండ్లలో మళ్లీ కారుకు లీడ్ రాగా.. 14వ రౌండ్ లో హ్యాండ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తర్వాత అన్ని రౌండ్లలోనూ గులాబీనే గుబాళించింది. మండలాల వారీగా చూస్తే మొదట లెక్కించిన గుర్రంపోడులో టీఆర్ఎస్ కు 2008 ఓట్ల ఆధిక్యత వచ్చింది. పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. తిరుమలగిరి సాగర్ లో 2 వేల 713 ఓట్ల లీడ్ కారుకు వచ్చింది. ఇక కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుమలలో.. టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అనుమల మండలంలో జానారెడ్డికి 447 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. హాలియా పట్టణంలోనే జానారెడ్డికి వెయ్యి ఓట్లకు పైగా ఎక్కువ ఓట్లు రాగా.. అనుమల రూరర్ లో మాత్రం భగత్ లీడ్ సాధించారు. నిజానికి అనుమల మండలంలో భారీగా లీడ్ తమకు వస్తుందని పోలింగ్ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకున్నారు.
Also Read :
ఇక నిడమనూర్ మండలంలో వార్ వన్ సైడ్ గానే జరిగింది. అనుమల మండలానికి సంబంధించి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగగా.. అన్ని రౌండ్లలోనూ భగత్ కు తిరుగులేని మెజార్టీ వచ్చింది. నిడమనూర్ మండలంలో నోముల భగత్ కు ఏకంగా 5 వేల 642 ఓట్ల మెజార్టీ వచ్చింది. తక్కువ ఓటర్లున్న మాడ్గులపల్లి మండలంలోనూ టీఆర్ఎస్ లీడ్ సాధించింది. త్రిపురారం మండలంలో కాంగ్రెస్ కు లీడ్ వస్తుందని భావించినా… అక్కడ కూడా కారు పార్టీ దుసూకుపోయింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7 వేల 640 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు భగత్.. అంతకంటే డబుల్ మెజార్టీ సాధించడం విశేషం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంచార్జీగా ఉన్న పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల లీడ్ వచ్చింది. బీజేపీ గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపినా.. వాళ్ల ఓట్లలోనూ 10 శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు రవి నాయక్. చలకుర్తి, నాగార్జున సాగర్ తో కలిసి 12వ సారి పోటీ చేసిన జానారెడ్డి.. నాలుగోసారి ఓడిపోయారు. వరుసగా రెండో సారి పరాజయం పాలయ్యారు.