మనవార్తలు ,పటాన్ చెరు:
బాగా సాగే పదార్థాల నమూనాతో తొడ ఎముక నమూనా బలం, క్రియాశీల ప్రవర్తన మూల్యాంకనం అనే అంశంపై విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి శ్రీధర్ కుమార్ ఆదిభట్లను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ. సత్యాదేవి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొడ అమరికలో తేడాల వల్ల నడకలో నొప్పి, ఒక కాలు మరొకదానిపై కుదించబడడం, కొన్ని సందర్భాలలో కదలిక పూర్తిగా ఆగిపోవడం వంటి విభిన్న సమస్యలకు దారితీస్తుందని, ఇవి పుట్టుకతో లేదా పోషకాహార లోపం, ప్రమాదం, గాయం వంటి పలు ఇతర కారణాల వల్ల సంభవించవచ్చని ఆమె వివరించారు.
అలాగే బోలు ఎముకల వ్యాధి ( వోపీ ) అనేది మధ్య వయస్కులలో అత్యంత సాధారణమైన, ప్రధాన ఆరోగ్య రుగ్మతలలో ఒకటన్నారు. ప్రస్తుత పరిశోధనలో, తొడ ఎముక నిర్మాణ సమగ్రతపై ఈ పరిస్థితుల ప్రభావాలను అన్వేషించేందుకు ప్రయత్నించినట్టు తెలియజేశారు. త్రీడీ పరిమిత మూలకం ( ఎఫ్ఎస్ఈ ) అనుకరణలను నిర్వహించడానికి రెండు వేర్వేరు తొడ ఎముక జ్యామితులు పరిగణించామన్నారు. శ్రీధర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.