ఏఐ-ఆధారిత చర్మ క్యాన్సర్ నిర్ధారణపై పరిశోధనకు పీహెచ్.డీ

Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని శ్రీలక్ష్మి చెరుకూరి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డెర్మోస్కోపిక్ ఇమేజ్ విశ్లేషణను ఉపయోగించి చర్మ క్యాన్సర్ గుర్తింపు కోసం ఆప్టిమైజ్ ఎన్సెంబుల్ డీప్ లెర్నింగ్ మోడల్స్ రూపకల్పన, అభివృద్ధి’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.డి.వి. ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సిద్ధాంత వ్యాసం, చర్మ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడంలో సహాయపడటానికి కచ్చితమైన, అర్థమయ్యే, విశ్వసనీయమైన కృత్రిమ మేధస్సు-ఆధారిత ఫ్రేమ్ వర్కును అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఈ పరిశోధన, ఆటోమేటెడ్ చర్మ క్యాన్సర్ నిర్ధారణలో ఎదురయ్యే క్లాస్ అసమతుల్యత, మల్టీ-క్లాస్ వర్గీకరణ, మోడల్ ఆప్టిమైజేషన్, ఓవర్ ఫిట్టింగ్ వంటి అనేక కీలక సవాళ్లను పరిష్కరిస్తుందన్నారు.

ఈ పరిశోధన ఇంకా, లెసియన్ సెగ్మెంటేషన్, క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (సీడీఎస్ఎస్)ను చేర్చిన ఒక FGBO–ఆప్టిమైజ్డ్ ఎన్ సెంబుల్ ఫ్రేమ్ వర్కును పరిచయం చేస్తుందన్నారు. ప్రతిపాదిత ఈ ఫ్రేమ్ వర్కు, కచ్చితమైన, నమ్మకమైన, పారదర్శకమైన రోగనిర్ధారణ మద్దతును అందించడానికి రూపొందించినట్టు తెలిపారు. ఇది చర్మ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సహాయపడటానికి, రోగ నిర్ధారణలో ఉండే వైవిధ్యాలను తగ్గించడానికి, వైద్య విధానంలో విశ్వసనీయమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు.

డాక్టర్ శ్రీలక్ష్మి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *