మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు . ఈ జాతర కార్యక్రమానికి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామస్తులు సంప్రదాయ వేషధారణతో స్వామివారికి పూజలు నిర్వహించగా, డప్పు చప్పుళ్లు, భజనలు, హారతులతో ఆలయ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఎమ్మెల్యే జిఎంఆర్ స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు ప్రతీకలని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఇటువంటి పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడే ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలోనూ దైవభక్తిని, సంప్రదాయాలను మరవకుండా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.జాతరల ద్వారా గ్రామాల్లో సామాజిక సమైక్యత, సోదరభావం పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాల్గొనడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని తెలిపారు. ఐనోలు గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి జాతర మరింత వైభవంగా కొనసాగాలని, స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిఐ వినాయక్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, పాల్గొన్నారు.
