గీతం  విద్యార్థికి రూ.60 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం

politics

విజయవంతంగా కొనసాగుతున్న ప్రాంగణ నియామకాలు

రూ.51 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్ కు ఎంపికైన ఇద్దరు గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరోసారి ప్రాంగణ నియామకాలలో మేటిగా నిరూపించుకుంది. ప్రతిష్టాత్మక బహుళజాతి సంస్థల భాగస్వామ్యంతో విశేష విజయాలను ప్రదర్శిస్తూ, 2024-25 విద్యా సంవత్సరానికి ప్రాంగణ నియామకాలలో మరోసారి తన సత్తా చాటింది. ఆకట్టుకునే అత్యధిక గరిష్ఠ వార్షిక వేతనం రూ.60 లక్షలతో ఒక విద్యార్థిని ఎంపిక కాగా, మరో ఇద్దరు రూ.51 లక్షల గరిష్ఠ వార్షిక వేతనానికి ఎంపికయ్యారు.బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థిని యర్రం అనూష అట్లాసియన్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుని, రూ.60 లక్షల వార్షిక వేతనాన్ని పొందనుంది. అంతేగాక, తన తోటి విద్యార్థిని కొర్రపాటి సమీనాతో కలిసి మైక్రోసాఫ్ట్ లో రూ.51 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎంపికైంది.ఈ ప్లేస్ మెంట్ సీజన్ లో గీతం విద్యార్థుల విజయం వారి కృషిని మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయం యొక్క బలమైన పరిశ్రమ-విద్యా సంబంధ అనుబంధాలను, అధిక నాణ్యత గల విద్యను అందించడంలో నిబద్దతను ప్రతిబింబిస్తుంది. ఇతర బహుళ జాతి సంస్థల ప్రాంగణ నియామకాలలో కూడా గీతం విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. సిలికాన్ ల్యాబ్ గీతం విద్యార్థి ఒకరిని రూ.22 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక చేయగా, పెగా సిస్టమ్స్ ఏడుగురు విద్యార్థులకు రూ.15.48 లక్షలు, డెలివరూ ముగ్గురుకి రూ.12.07 లక్షలు, ఒరాకిల్ ఐదుగురికి రూ.10 లక్షలు, రిలయన్స్ జియో బీపీ ఒక విద్యార్థికి రూ.9 లక్షలు, డెలాయిట్ పీపీవో ఐదుగురికి రూ.8.64 లక్షలు, ఏషియన్ పెయింట్స్ ముగ్గురుకి రూ.8.5 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్ 14 మందికి రూ.8.29 లక్షలు, నౌకరీ.కామ్ ఒక్కరికి రూ.7 లక్షలు, పీజీఎస్ ముగ్గురు విద్యార్థులకు రూ.8 లక్షలు, కీలూప్ ఆరుగురికి రూ.7.2 లక్షలు, వయాప్లస్ ఐదుగురికి రూ.7 లక్షలు, హెచ్ అండ్ ఆర్ బ్లాక్ నలుగురుకి రూ.5.27 లక్షలు, మ్యూసిగ్మా 17 మందికి రూ.5 లక్షలు, ఈవై జీడీఎస్ 49 మందికి రూ.4.83 లక్షలు, యాక్సెంచర్ 92 మందికి రూ.4.5 లక్షలు, టెక్ మహీంద్రా 85 మంది విద్యార్థులను రూ.4 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక చేశాయి.కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రెడ్డి ప్రస్తుత ప్లేస్ మెంట్ సీజన్ పై స్పందిస్తూ, ‘ఈ ఏడాది మా ప్రాంగణ నియామకాలను అట్లాసియన్, మైక్రోసాఫ్ట్, సిలికాన్ ల్యాబ్స్, పెగా సిస్టమ్స్ వంటి ప్రముఖ బహుళ జాతి కంపెనీలతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా విద్యార్థులు తమ అసాధారణ నైపుణ్యాలను, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి సంసిద్దతను నిరంతరం ప్రదర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.ఈ అద్భుతమైన ప్రాంగణ నియామకాల గణాంకాలు విద్యా నైపుణ్యం (అకడమిక్ ఎక్సలెన్స్) పట్ల గీతం అంకితభావాన్ని, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో విజయవంతమైన కెరీర్ కోసం విద్యార్థులను సిద్ధం చేయడంలో దాని నిబద్దతను చాటి చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *