ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరిన మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసే క్రికెట్ క్రీడాకారుల జట్టులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పారదర్శకతతో ఎంపిక జరిగేలా చూడాలని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు, సభ్యులు పలు అంశాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్‌రెడ్డి గత 25 సంవత్సరాలుగా ఏకచత్రాధిపత్యం వహిస్తూ.. తనకు నచ్చిన వారిని జట్టుకు ఎంపిక చేస్తున్నారని తెలిపారు. జిల్లా జట్టు ఎంపిక చేసే సమయంలో ఆయా నియోజకవర్గ పరిధిలోని క్రికెట్ క్లబ్ లను సంప్రదించడం లేదని తెలిపారు. క్రీడాకారులకు సైతం సమాచారం అందించకుండా జట్టు ఎంపిక నిర్వహిస్తూ నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా జిల్లా అసోసియేషన్‌కు మంజూరయ్యే నిధుల ఖర్చులో సైతం అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు ప్రతిభ కలిగిన క్రీడాకారులను సైతం ఎంపిక చేయడం లేదని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
