పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని దీపిక ఏ.ఆర్. డాక్టరేట్ కు అర్హత సాధించారు. లీనియర్, నాన్-లీనియర్, ఎక్స్ పోనెన్షియల్ స్ట్రెచింగ్ షీట్ పై నానో ఫ్లూయిడ్ల వేడి, ద్రవ్యరాశి బదిలీ విశ్లేషణకు సంఖ్యా విధానం అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. గోవర్ధన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ దీపిక చేసిన పరిశోధన నానో ఫ్లూయిడ్లతో కూడిన సంఖ్యా మోడలింగ్, ఉష్ణ బదిలీ దృగ్విషయాలపై వినూత్న అంతర్దృష్టులను అందిస్తుందని తెలిపారు. ఇది ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్సెస్ లో పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోందన్నారు. అంతేగాక, ఈ పరిశోధనలో భాగంగా, డాక్టర్ దీపిక నాలుగు పరిశోధనా పత్రాలను స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్ లో ప్రచురించినట్టు తెలియజేశారు.డాక్టర్ దీపిక సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.డాక్టర్ దీపిక సాధించిన విజయం, ఆయా విభాగాలలో అత్యాధునిక పరిశోధన, విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను నొక్కి చెబుతోందన్నారు.