మనవార్తలు ,పటాన్ చెరు:
ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఆరు నెలలు లేదా ఓ ఏడాది ముందుగా గుర్తించేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గీతం అధ్యక్షుడు ఎం . శ్రీభరత్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ముగిసింది . ఆ ఉత్సవానికి సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ , క్యాన్సర్ చాలా ప్రమాకరమైన వ్యాధని , అది ప్రజలను కబళిస్తోందని , క్యూమో థెరపీ వంటి చికిత్సలున్నా పాక్షికంగానే రోగులు బయటపడుతున్నారని , కానీ రేడియేషన్ ప్రభావం దీర్ఘకాలం వారిని వేధిస్తోందని విచారం వెలిబుచ్చారు . అసలు ఆ రోగం వచ్చే లక్షణాలను ముందుగానే పసిగట్ట గలిగితే చాలామందిని ప్రజలను కాపాడగలిగిన వారమవుతామని , విస్తృత చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదని శ్రీభరత్ అన్నారు . సమస్యలను పరిష్కరించాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థులు చాలా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని , కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు .
రేడియేషన్ మన జీవితంలో ఓ భాగమని , అన్నిరకాల రేడియేషన్లు హానికరం కాదని , దాని రక్షణ సూత్రాలను అర్థం చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని భాభా అణు పరిశోధనా కేంద్రంలోని రేడియేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె.కె.భరద్వాజ్ కోరారు . ‘ రేడియేషన్ టెక్నాలజీ ఇన్ పాలిమర్ సెన్సైస్’పై ఆయన ఉపన్యసించారు . రేడియోధార్మికత , రేడియోధార్మిక పదార్థాలు విద్యుత్ ఉత్పత్తి నుంచి ఔషధాలు , పరిశ్రమలు , వ్యవసాయంలో వినియోగిస్తున్నామని , ఇది ఒకరకంగా బహుళ ప్రయోజకారిగా ఆయన అభివర్ణించారు . ‘ రేడియోయాక్టివిటీని నిర్వహించడంలో భద్రతా అంశాల’పై బార్క్ పూర్వ శాస్త్రవేత్త , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు ఉపన్యసించారు .
అంతకు మునుపు , ఆయన డాక్టర్ భరద్వాజను సత్కరించారు . గీతం ఈ ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కార్యశాల సదస్యుల మనన్ననలను చూరగొంది . బార్క్ శాస్త్రవేత్తలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి రేడియేషన్ గురించి , అణు ప్రతిచర్యలు , ఆరోగ్య సంరక్షణ , ఆహార పరిశ్రమలో ఐసోటోప్ల వినియోగం వంటి ఎన్నో విలువైన విషయాలను వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమాలన్నింటిలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతినిధులు , విద్యార్థులను ధ్రువీకరణ పత్రాలతో పాటు విలువెన పుస్తకాలను పంపిణీ చేశారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , బార్క్ శాస్త్రవేత్త డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు .