రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణి చేస్తోన్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
శుక్రవారం జిన్నారం మండలం సోలక్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయనీ అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న జీలుగు విత్తనాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. జిన్నారం మండల పరిధిలో 60 శాతం సబ్సిడీ పై 90 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం నేడు లాభసాటిగా మారిందంటే ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే అన్నారు. దుక్కి దున్నినప్పటి నుండి పంటను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అనంతరం గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సొసైటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో..
మండల కేంద్రమైన గుమ్మడిదల సొసైటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ఎమ్మెల్యే జిఎంఆర్ జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 60 శాతం సబ్సిడీతో అందిస్తున్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రైతులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.