మీ ఆలోచనే మీకు పెట్టుబడి

Telangana

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఒక మంచి ఆవిష్కరణ లేదా ఆలోచననే నేడు పెట్టుబడిగా, లేదా మేధో మూలధనంగా పరిగణిస్తున్నారని వజ్ర ఆటోమేషన్ పూర్వ కార్యనిర్వహణాధికారి (సీఈవో) జె. శ్రీనివాసరావు చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ లో అధునాతన ధోరణులు’ అనే అంశంపై ఆయన మంగళవారం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వర్ధమాన ఇంజనీర్లను ఆలోచింపజేసే, అంతర్దృష్టితో కూడిన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.ఆరెంజ్ ఎకానమీ అనే భావనను వివరిస్తూ, దీనిని సృజనాత్మకత, ఆలోచనలు ఆర్థిక విలువను ఉత్పత్తి చేసే ఒక పర్యావరణ వ్యవస్థగా శ్రీనివాసరావు అభివర్ణించారు. వయస్సు, అనుభవంపై ఆవిష్కరణ ఆధారపడి ఉండదని, ఆలోచనలను ఫలితాలుగా మార్చగల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆశాజనకమైన ఆలోచనలకు నిధులు సమకూర్చడానికి నేడు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులు ఆయా సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, వారి భావనలను మెరుగుపరచడానికి అర్థవంతంగా సంభాషించాలని సూచించారు.

దాదాపు సగం కంటే ఎక్కువ స్టార్టప్ లు విద్యా ప్రాంగణాల నుంచే ఉద్భవిస్తున్నాయని శ్రీనివాసరావు వెల్లడించారు. విద్యార్థి క్లబ్ లను ఏర్పాటు చేయడం, సహచరులతో సహకరించడం, జట్టు కృషిని స్వీకరించడం మంచిదన్నారు. ఏ వ్యక్తీ ఒంటరిగా అన్ని రంగాలలో నైపుణ్యం సాధించలేడని ఆయన పునరుద్ఘాటించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వాతావరణంలో విద్యార్థులు తక్షణమే స్పందించడం నేర్చుకోవాలని, నేటి ప్రపంచంలో ఒక దశాబ్దం కూడా చాలా ఎక్కువన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాణించడం కోసం ఎన్పీటెల్ (NPTEL) వంటి వేదికలను ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు.

మానవ మెదడుకు పరిమితి ఉందంటూ, ఇది తరచుగా సృజనాత్మకత ఆలోచనను పరిమితం చేస్తుందని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. పలు వీడియో క్లిప్ లు, మన చుట్టూ నిత్యం జరిగే ఉదాహణలతో కూడిన ఫోటోలను చూపుతూ, విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించాలని, వారు గమనించిన దాని వెనుక ఉన్న ఆలోచనలను వ్యక్తపరచమంటూ ప్రోత్సహించారు. విస్తృతంగా చదవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహకార వాతావరణంలో మెదడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సాంకేతిక మార్పును అందిపుచ్చుకోవడంలో విఫలమైతే, ఎందుకూ కొరగాకుండా పోతామని హెచ్చరించారు. మానవ మనుగడ, పురోగతి ఎలక్ట్రానిక్స్ పై ఎక్కువగా ఆధారపడి ఉందని, భవిష్యత్తు సాంకేతిక ఆవిష్కరణ నుంచి విడదీయరాదని శ్రీనివాసరావు స్పష్టీకరించారు.

ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి, ప్రొఫెసర్ సీహెచ్. సుమంత్ కుమార్, డాక్టర్ ఎన్. శ్యామ్ సుందర్ సాగర్ కన్వీనర్లుగా వ్యవహరించారు. ఈ ముఖాముఖిలో ఈఈసీఈ విద్యార్థులు పాల్గొని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ధోరణులపై ప్రశ్నలడిగి, వివరాలు తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *