మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ లో శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వై ఆర్ శ్యామల మాట్లాడుతూ ”డబ్బున్న వారికి చదువు ఆభరణం- పేదవారికి చదువు ఆయుధం ”అంటూ ప్రతి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మాతృభాష తెలుగును మర్చిపోరాదని చెబుతూ తెలుగులో చదువుకున్న వారెందరో చాలా ఉన్నత స్థాయికి వెళ్లారని, తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా గౌరవించి చదివించాలని పిలుపునిచ్చారు. హైదర్ నగర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకురాలు జోషి అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి తల్లి తన బిడ్డల మీద అతి ప్రేమ చూపకుండా బాధ్యతాయుతంగా చదువుకునే విధంగా చూడాలని అన్నారు. ప్రతి పేద విద్యార్థి చదువుకుంటే భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవడానికి సాధ్యపడుతుందని కనుక క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్లాలని అన్నారు.
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నాయకులు చావా అరుణ, కళ్యాణి, పద్మావతి, గొర్రెపాటి వివేక్, జయలక్ష్మితోపాటు విద్యార్థులు,వారి తల్లులు మరియు కాలనీలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లీన్ ఫర్ గుడ్ సొసైటీ ముఖ్య అతిథిగా పాల్గొన్న వై. అర్. శ్యామల, అరుణశ్రీ లతో పాటు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.