సెమినార్ లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న మోడీ ప్రభుత్వం
ఎఏటికి ఆ ఏడు కొండంతలగా పెరుగుతున్న పెట్టుబడుదారుల ఆస్తులు
ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చెయ్యండి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ప్రజానికం, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పటాన్ పట్టణంలోని శ్రామిక్ భవన్ లో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సెమినార్ లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1975, జులై 25వ తేదీన ఆనాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించిన రోజన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికచెల్లదని హైకోర్టు తీర్పునివ్వడంతో, సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రధానమంత్రిగా కొనసాగిందని గుర్తు చేశారు. దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ఇందిరా గాంధీ ఆనాడు ఎమర్జెన్సీని విధించడం జరిగిందని అన్నారు. ఆనాడు కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం ఇందిరా గాంధీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అప్పటికే ప్రజల్లో నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి సమస్యలతో అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఆనాడు ప్రజా పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయని గుర్తు చేశారు.
అందులో భాగంగానే 1957 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వం ఈఎంఎస్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందించిన చరిత్ర వామపక్ష ప్రభుత్వాన్నిదన్నారు. 1974లో రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 24 రోజులపాటు సమ్మె జరిగిందని గుర్తు చేశారు. ప్రజలు, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని చూసి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందని చెప్పారు. ఎమర్జెన్సీ అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఉండవన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేక రూపాలలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రశ్నించినందుకు గౌరీ లంకేష్, మరియు జేఎన్టీ యు స్టూడెంట్ దిశా పైన దేశద్రోహం కింద ఏడు నెలలు జైల్లో ఉంచారని ఆరోపించారు. సాయిబాబాను 90% వికలాంగుడైనప్పటికీ జైల్లో పెట్టారని గుర్తు చేశారు.ప్రస్తుతం ఎమర్జెన్సీ పేరుతో కాకుండా కొత్త రూపాలలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న, ప్రశ్నిస్తున్న వాళ్లను అనేక రూపాలలో శిక్షిస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆదాని అంబానీ ఆస్తులను పెంచుకోవడానికి దోహదం చేస్తుందని అన్నారు. పెట్టుబడిదారుల ఆస్తులు సంవత్సర కాలంలో మూడు ఇంతలు పెరిగిందని అన్నారు. ఉగ్రవాద దాడి తర్వాత టాటా బిర్లా ఆదాని, అంబానీ లు మతోన్మాద శక్తులతో కలిసిపోయారని గుర్తు చేశారు. ఆదివాసీలకు సంబంధించిన అటవీ సంపదను హరించిపోయే విధంగా ఆదాని అంబానీలకు కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా చేసే కుటిల ప్రయత్నం జరుగుతుందని, అందుకోసం ప్రజలు ,కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఇందులో ప్రజలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, బి వి ఆర్ కె రాజు, ఎంజీబీఎస్ ప్రసాద్, సత్తిబాబు, మని రాజు, నరసింహారెడ్డి, రామచంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు.