అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా సత్కారం
మనవార్తలు ,పటాన్ చెరు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నేడు పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ సంబరాలకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరు కాబోతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలకు అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీ ల నుండి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, ఆశ, అంగన్వాడీ, ఇందిరా క్రాంతి పథం మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు సుమారు రెండు వేల మంది వరకు క్రీడా పోటీలలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఉత్సాహ భరితమైన వాతావరణములో 21 క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇద్దరు చొప్పున మహిళా ఉద్యోగులకు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదిక రూపంలో మంత్రి గారికి తెలియచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.