గీతంలో సాంకేతికత సాయంతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిపై శిక్షణ
ప్రధాన శిక్షకులుగా పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్తలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం అధునాతన సాంకేతికత (మోల్ సాఫ్ట్) సాయంతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘మాలిక్యులర్ డాకింగ్, వర్చువల్ స్క్రీనింగ్’ పేరిట శుక్రవారం నిర్వహించిన ఈ ఒకరోజు కార్యశాలలో ప్రధాన శిక్షకులుగా పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్ సైంటిస్టులు ఆదిత్య మిశ్రా, డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్ వ్యవహరించారు.కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో పాల్గొనే వారికి ఆచరణాత్మక నైపుణ్యాలను సమకూర్చడం లక్ష్యంగా నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఔషధ ఆవిష్కరణ ప్రక్రియలను అనుకరించడానికి, క్రమబద్ధీకరించానికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ మోల్ సాఫ్ట్ వాడకంపై ప్రధానంగా దృష్టి సారించారు. మోల్ సాఫ్ట్ ఐసీఎం సాధనాల కార్యాచరణలపై లోతైన శిక్షణను అందించారు.

తద్వారా ఖర్చు తగ్గించడం, సులువుగా వినియోగించడం, ఔషధాభివృద్ధిలో మానవశక్తిని తగ్గించే విధానాలను వారు ప్రదర్శించారు. ఐసీఎం-ప్రో ఇంటర్ ఫేస్, ప్రత్యక్ష ప్రదర్శనల వంటివి ఇందులో పాల్గొన్న వారి అభ్యాస అనుభవాన్ని మరింత మెరుగుపరిచాయి.తొలుత, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్ అతిథులిద్దరినీ ఆహ్వానించి, సత్కరించారు. పరిశోధనలో అధునాతన కంప్యూటేషనల్ సాధనాలను వినియోగించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

పరిశోధనా నాణ్యత, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.డాక్టర్ ఎలగందుల సతీష్, డాక్టర్ విన్యాస్ మాయాస సమన్వయం చేసిన ఈ కార్యశాలలో అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు దాదాపు 25 మంది చురుకుగా పాల్గొని ఆచరణాత్మక అనుభవంతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పొందారు.ఈ చొరవ, ఔషధ శాస్త్రాల రంగంలో ఆవిష్కరణ, ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడంలో గీతం యొక్క నిబద్ధతను ప్రతిబింబించింది.
