పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు సంపూర్ణ సహకారం అందించడం ప్రశంసనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అన్నదమ్ములు గత 30 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తూ, తాము చదువుకున్న పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాసరచన ఉపన్యాస పోటీల విజేతల బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షకురాలు, ప్రత్యేక ఉపాధ్యాయురాలు, స్కావెంజర్ల కు సంబంధించిన జీతభత్యాలు అందించడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన, ప్రభాస్ భారతీయులు వెంకటేష్ గౌడ్, ఆనంద్ గౌడ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.