వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

politics Telangana

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి

మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి

పెన్షన్, ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి నెరవేర్చాలని ఎన్ పిఆర్ డి డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రభుత్వంను డిమాండ్ చేశారు.వికలాంగుల పెన్షన్ రూ 6వేల కు పెంచడంతోపాటు, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలంటూ శనివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్ పిఆర్ డి) ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేశారు. అనంతరం తహసిల్దార్ రంగారావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6000లకు, వృద్ధులు, వితంతువులతో పాటు మిగతా చేయూత పెన్షన్స్ 2016 నుండి 4వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతున్నప్పటి కి పెన్షన్ పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకువడం లేదని ఆరోపించారు. పెన్షన్ పెంచకుండానే ప్రస్తుతం ఇస్తున్నా పెన్షన్స్ లలో 1.92 లక్షల మంది పెన్షన్స్ 21 నెలల కాలంలో రద్దు చేశారని మండిపడ్డారు. 2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్స్ కోసం ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకుని, 21 నెలల నుండి కొత్త పెన్షన్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 21 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లో చలనం లేకపోవడం దారుణమన్నారు.

2025-26 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేయూత పెన్షన్స్ కోసం అవసరమైన నిధులు కేటాయించాలని,పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు, తదితర సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో డివిజన్ కార్యదర్శి కుమ్మరి నర్సిములు,మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు పి మేరీ,సత్యనారాయణ, చెన్నారెడ్డి, అంజమ్మ, ధనలక్ష్మి, శ్రీకాంత్, ఈసాక్, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *