పటాన్ చెరు:
ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలైన ప్రజా పాలన , న్యాయం , చట్టాల అమలును మరిచి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం పాలవుతుందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రజా సేవల్లో ప్రభుత్వం పాత్రకె ( రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ) అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , పన్నుల వసూలు చేయడం , డబ్బు పంపిణీ చేయడమే పాలన కాదని ఆయన స్పష్టీకరించారు .
ఇవి పేదరికారిన్న అంతం చేయకపోగా , సమానత్వాన్ని కూడా ప్రోత్సహించలేవని , మానవ గౌరవాన్ని పెంపొందించలేవన్నారు . ఇటువంటి కార్యకలాపాలు ఆయా ప్రభుత్వాలకు ఓట్లను తెచ్చిపెట్టడంతో పాటు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవని స్పష్టీకరించారు . చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం , నిత్య పేదరికం , దోపిడీ , నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించి , ప్రజలకు అందుబాటులో ఉండేలా కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం సమాజాన్ని అధోగతి పాలు చేస్తుందని హెచ్చరించారు .
కల్తీలేకుండా కనీసం ఒక గ్లాసు మంచి తాగునీరు ఇవ్వలేకపోవడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు . నాణ్యమైన విద్య , వైద్యం లేని సమాజం అభివృద్ధి చెందదని , అవి అటు వ్యక్తిగతంగా , ఇటు సమాజపరంగా పురోభివృద్ధికి బాటలు వేస్తాయని , అవి పౌరులందరికీ కల్పించలేకపోతే సమాజం చితికిపోతుందని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు . తొలుత , కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి అతిథిని స్వాగతించగా , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ డాక్టర్ జయప్రకాశ్ను సత్కరించారు .