_ప్రశంసించిన జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ)లోని మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వనరులు, పర్యావరణం అంతా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉన్నాయని, ఇక్కడ విద్యనభ్యసించే వారంతా తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ సూచించారు. కేఎస్ పీపీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. గతంలో (2010కి పూర్వం) తాను ఇండియాలోని జర్మనీ తరఫున పనిచేశానని, అప్పటికీ ఇప్పటికీ జరిగిన అభివృద్ధి వర్ణనాతీతమని ఆయన చెప్పారు.
జర్మనీకి వాణిజ్య, వ్యాపార భాగస్వామిగా భారతదేశం ప్రాముఖ్యత పెరుగుతోందని డాక్టర్ అకెర్ మాన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఖచ్చితమైన ఆలోచనలు, పొత్తుల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారతీయ విద్యార్థుల పనితీరు, నీతి, అంకితభావాలను ప్రశంసించారు. జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, చాలానుంది ఇంజనీర్లు అక్కడే స్థిరపడుతున్నట్టు చెప్పారు.జర్మనీ సరళ వలస విధానం, భారతదేశం- ఐరోపా సమాఖ్యల సరళ వాణిజ్య ఒప్పందాలు, ఇంధన విధానం, ప్రపంచ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంతో సహా అనేక అంశాలపై డాక్టర్ అకెర్ మాన్ ప్రసంగించారు. ఆయా సమస్యలపై జర్మనీ విధానంపై లోతైన అవగాహనను కల్పించడంతో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
జర్మనీ రాయబార కార్యాలయం, కేఎస్ పీపీ మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థి హరీశ్వర్ చేసిన నందన సమర్పణతో ఈ ముఖాముఖి కార్యక్రమం ముగిసింది. కేఎస్ పీపీ తన విద్యార్థుల విద్య, అనుభవాలను మెరుగుపరచడానికి ప్రపంచ నాయకులతో అర్థవంతమైన చర్చ, జ్ఞాన మార్పిడిని కొనసాగించడం పట్ల ఆసక్తిని ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా వ్యక్తపరుస్తోంది.