_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. కొలరాడో (అమెరికా)లోని డెన్వార్ కి చెందిన మైఖేల్ రచయిత, వ్యవస్థాపకుడు, న్యాయవాది, పెట్టుబడిదారు, పరోపకారిగా పేరొందారు. పాలన, రాజకీయ నిర్మాణాలపై తన దృక్కోణాలను గీతం విద్యార్థులతో పంచుకున్నారు. డాక్టర్ విలయమ్స్ ప్రసంగం కేవలం విద్యాపరంగానే కాక, సాంప్రదాయిక వివేకాన్ని సవాలు చేయడం, పాలనా నిర్మాణాల యొక్క క్లిష్టమైన పూనం మూల్యాంకాన్ని ప్రేరేపించేలా సాగింది. తద్వారా సంభావ్య ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థలపై మన అవగాహనను పునర్నిర్మించడమే గాక మరింత న్యాయమైన, సమానమైన , సమతుల్య రాజకీయ సంస్థల వెపు స్పష్టమైన మార్గాలను అందించింది.
ఆధునిక, పురాతన అధికారాల విభజనపై డాక్టర్ విలియమ్స్ దృష్టి సారిస్తూ, ఆధునిక కాలంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయపరమైన అధికారాల త్రయాన్ని నొక్కి చెప్పారు.
అయితే రాచరికం, కులీనత, ప్రజాస్వామ్యం అనే పాత త్రైపాక్షిక విభజనతో ఆయన విభేదించారు. ప్రజాస్వామ్యం, శాసనం, సమాఖ్య అంశాలకు అనుగుణంగా కార్యనిర్వాహక, శాసన, ప్రజాస్వామ్యం, రాచరికం, న్యాయవ్యవస్థ, కులీనత అంశాలతో కూడిన ‘క్యూబిక్’ రాజ్యాంగం భావన చుట్టూ ఆయన చర్చ సాగింది. విలియమ్స్ తన ప్రభావవంతమైన పుస్తకం ‘అమెరికా ఆన్ ట్రయల్’ నుంచి ఒక సంచలనాత్మక దృక్పథాన్ని అందించారు. రాజకీయ సంస్థ కోసం కొత్త సిద్ధాంతిక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడమే గాక, అది పాలనా విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగలదని ఆయన విశ్వసించారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ, రాచరికం, కులీనత, ప్రజాస్వామ్యం, సమాఖ్య, రాష్ట్ర, స్థానిక అంశాలను పాలనకు ప్రాథమికమైనవని ప్రొఫెసర్ విలియమ్స్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. జీఎస్ హెచ్ ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని సత్కరించారు. రాజనీతి శాస్త్ర విభాగం సమన్వయకర్త డాక్టర్ మయాంక్ మిశ్రా అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ గుర్రం వందన సమర్పణతో ఈ ఆతిథ్య ఉపన్యాసం ముగిసింది. ఈ చర్చ ఒక ప్రత్యేకమైన, భిన్న దృక్కోణం నుంచి రాజకీయ నిర్మాణాలను ఆలోచింపజేసేదిగా కొనసాగింది.