_పటాన్చెరు కి పెద్దాసుపత్రి
_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి..
_జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
_సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణానికి పెద్దాసుపత్రి రాబోతోంది.దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యాలతో ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలుపెరుగని కృషి మూలంగా అత్యాధునిక సౌకర్యాలు ..ఆధునిక శస్త్ర చికిత్సలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అతి త్వరలో అందుబాటులోకి రానుంది.ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లను ప్రారంభించి, అనంతరం 11 గంటలకు పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు సీఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ వెల్లడించారు.మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O. Ms. 82 జారీ చేసిందన్నారు.
ఆస్పత్రి నిర్మాణం కోసం 184 కోట్ల 87 లక్షల 55 వేల రూపాయల నిధులు మంజూరు కాగా, మొత్తం వ్యయంలో 25% అనగా 46 కోట్ల 21 లక్షల 88 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 75% అంటే రూ.138,65,66,287/-లను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుందని తెలిపారు.సివిల్ వర్క్స్ నిర్మాణం మరియు పరికరాలు, ఫర్నిచర్ మరియు ల్యాబ్ల సేకరణ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMSIDC) ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి.తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు.పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారని తెలిపారు.దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు.
శంకుస్థాపనకు సిద్ధంగా స్థలం..
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని సిద్ధం చేశారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేటాయించారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని, శర వేగంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.