మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ 18 వ జాతీయ మహాసభలలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన చుక్క రాములు కు బుధవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. వెనిజులాపై అత్యంత పాశవికంగా దాడిచేసి అధ్యక్షుని బంధించి తమదేశంలో విచారణ జరుపుతామని అమెరికా అంటుందంటే ఐక్యరాజ్యసమితి ఉన్నట్టా, లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ చట్ట సవరణతో, రైతుచట్టంతో, లేబరుకోడ్స్ తో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంటున్నదని తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, వి. సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.
