మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జి టి ఎన్ కాలనీలో శ్రీరామనము సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ సహకారంతో కళ్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కోనసాగాయి. నీలం మధు సొంత నిధులతో నిర్మించిన ఈ ఆలయంలో గత ఐదు రోజులుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. జలధివాసం, ధాన్యాధివాసం వంటి క్రతువులతో పాటు లోక కల్యాణం కోసం నిర్వహించిన హోమాలు, యజ్ఞ యాగాదులతో చిట్కుల్ గ్రామం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన స్వామివారి విగ్రహాలకు మహా కుంభాభిషేకం నిర్వహించి, భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని సిద్ధం చేశారు.శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

నీలం మధు ముదిరాజ్ దంపతులు తమ స్వగృహం నుంచి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను ఊరేగింపు గా తీసుకుని వచ్చి స్వామి వార్లకు సమర్పించి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. సీతారాముల విగ్రహాలను చూడముచ్చటగా అలంకరించి ముత్యాల తలంబ్రాలతో సాగిన ఈ కల్యాణ ఘట్టం భక్తులకు కనువిందు చేసింది.ఈ మహత్తర కార్యక్రమానికి భక్తజనసంద్రం పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు అయ్యారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన సంగీత విభావరిలో గాయని భవాని ఆధ్వర్యంలో గాయకులు ఆలపించిన గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఆలయ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ప్రముఖ గాయని గాయకులు ఆలపించిన భక్తి పాటలకు మహిళలతో కలిసి నీలం మధు దంపతులు కోలాటం ఆడి ఉత్సాహం పెంచారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామస్తులందరి సహకారంతో నూతన ఆలయ నిర్మాణం పూర్తి కావడం, సీతారాముల ప్రతిష్టాపన జరగడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయని తెలిపారు. ఆ సీతారాముల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
