గీతంలో క్రీడలు, బృంద స్ఫూర్తిని చాటే ‘లక్ష్య’ ప్రారంభం

Telangana

క్రీడా జ్యోతిని వెలిగించి, వేడుకలు ప్రారంభించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) హైదరాబాద్ లో రెండు రోజుల అంతర్ కళాశాల క్రీడా పోటీలను ‘లక్ష్య-2024’ పేరిట గురువారం సగర్వంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు క్రీడా జ్యోతిని వెలిగించి, పోటీలు ప్రారంభమైనట్టు లాంఛనంగా ప్రకటించారు. విద్యార్థులంతా వివిధ క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు బృంద స్ఫూర్తి, సాహచర్యాన్ని ప్రోత్సహించే సమ్మిళిత, ఉత్సాహభరిత వాతావారణాన్ని నెలకొల్పే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్రీడలు కేవలం పోటీకి సంబంధించినదే కాదని, ఇది నేర్చుకోవడం ఎదగడం, తోటి విద్యార్థులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడమని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఉద్బోధించారు.ఔత్సాహిక విద్యార్థులను ఎమరాల్డ్, డైమండ్, పెరల్, రూబీ, టోపాజ్, సఫైర్ పేరుతో ఆరు బృందాలను ఏర్పాటు చేసి, వారిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభ, నాయకత్వ లక్షణాలు వెలికితీసేలా ప్రోత్సహిస్తున్నారు. విజేతలకు పతకాలు, ట్రోఫీలతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేయనున్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీఎస్బీ డైరెక్టర్ ఇన్ ఛార్జి డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, ఇందులో పాల్గొనే వారికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశంతో పాటు విలువైన పాఠాలను స్వయంగా నేర్చుకుని, తమంత తాముగా ఎదగడానికి వేదికగా ఆమె అభివర్ణించారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ‘లక్ష్య’ వంటి పోటీలు అమూల్యమైన అనుబంధాలను ఏర్పరచడమే గాక, మంచి స్నేహాలను కూడా సృష్టిస్తాయన్నారు. స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ నారాయణరావు చౌదరి వందన సమర్ఫణతో ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి.టోపాజ్, ఎమరాల్డ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్ తో పోటీలు శ్రీకారం చుట్టుకుని, అందులో పాల్గొనేవారి ఉత్సాహాన్ని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శింపజేశాయి. పీజీ ప్రోగ్రామ్ చైర్ పర్సన్లు డాక్టర్ శశికాంత్ కొంపెల్లి, డాక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ రూపలత, విద్యార్థి సమన్వయకర్తలు యతేష్, రఘులతో కలిసి ఈ పోటీలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది ప్రతి ఈవెంట్ లో విద్యార్థులకు మద్దతిస్తూ, వారిని ఉత్సాహపరిచారు. ఒక్కో జట్టు ఒక్కో రంగు దుస్తులు ధరించి, మొత్తం క్రీడా మైదానంతా వర్ణశోభితంగా మారి, విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *