_ఆందోళన చేపట్టిన ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ సభ్యులు
మనవార్తలు ,పటాన్ చెరు:
శనివారం పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము చట్టబద్ధంగా కొన్న ఫ్లాట్లలో కొంతమంది తమను ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని, తమకు సహకరించాల్సిన పంచాయతీ యంత్రాంగం బడా బాబులకు వత్తాసు పలుకుతూ తమకు సంబంధించిన రికార్డులేవీ పంచాయతీ కార్యాలయం లో లేవని చెబుతుండటంపై ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం పాటి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శని నిలదీశారు. కుటుంబ సభ్యులతో సహా పాటి చేరుకున్న ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అక్కడ ఆందోళన చేపట్టి అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో నిలదీయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న పాటి సర్పంచ్ లక్ష్మణ్ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడారు.

తాను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పేదలకు అండగా ఉంటున్నానని ఈ విషయంలో కూడా ప్లాట్ ఓనర్స్ అందరికీ తాను తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇటువంటి చట్టబద్ధమైన విషయాలలో స్థానిక నాయకులను, ఎమ్మెల్యేను బదలాం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. 1977లో కొన్న తమ ప్లాట్లను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని తమను బయటకు పంపించాలని చూస్తున్నారని దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని, కోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే తమ ప్లాట్లలో తాము నిర్మాణాలు చేపడతామని ఇందుకు అధికారులు, స్థానిక నాయకులు తమకు సహకరించాలని ఈ సందర్భంగా ప్లాట్ ఓనర్స్ సభ్యులు కోరారు.
