146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మనవార్తలు ,పటాన్చెరు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు డివిజన్, పటాన్చెరు మండలం, అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల సాధకబాధకాలను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రెండు పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.

ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడం కోసం పసలేని ఆరోపణలు చేయడం మానుకోవాలని లేని పక్షంలో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మార్వోలు మహిపాల్ రెడ్డి, విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అఫ్జల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
