మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా రాష్ట్రంలో ప్రతి మహిళలకు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన మరో పది లక్షల మందికి రూ. 2,016 చొప్పున పింఛన్లను ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను చిట్కుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ఆశా వర్కర్లు, మహిళలతో రాఖీలు కట్టించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్మే ప్రభుత్వం తమదని అన్నారు. మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ. 200 ఉన్న పింఛన్ ను కేసీఆర్ ప్రభుత్వం పది రెట్లు పెంచిందన్నారు. ఒంటరి, వితంతు మహిళలతో పాటు బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లను అందించి అందరి హృదయాల్లో నిలిచారని నీలం మధు ముదిరాజ్ చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు సరైన గౌరవం, అవకాశాలు దక్కేలా ఆత్మస్థైర్యం పెంచే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు తనవంతు సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. అందులో భాగంగానే చిట్కుల్ గ్రామంలో పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకు రూ. 51 వేలు తన స్వంత డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ కవిత, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, మురళీ, రాజ్ కుమార్, వెంకటేష్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, చాకలి వెంకటేశ్, సంగన్న గారి వెంకటేష్, సంగన్న గారి గోపాల్, అనిల్, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.