పటాన్‌చెరు:
ప్రప్రథమ భారత ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 133 వ జయంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ వహించి, వారి వ్యక్తిగత ఎదుగుదలకు సమ ప్రాధాన్యం ఇస్తే ఉపాధ్యాయుడే వారికి ఆదర్శం అని అన్నారు. తమలో పరివర్తన కలిగించిన అధ్యాపకులను ఏ విద్యార్థి అయినా జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.
మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ కొత్త బోధనా పద్ధతులను అలవరచుకోవాలని, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. అన్నింటికీ మించి నాణ్యమైన పరిశోధనలపై దృష్టి సారించి, గీతం లక్ష్యమైన ప్రపంచ మేటి వంద విశ్వవిద్యాలయాలలలో ఒకటిగా నిలవాలన్న ఆకాంక్షకు దోహదపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ వినయ్ కుమార్ మిట్టల్, జీఎస్ హెచ్ఎస్ డెరైక్టర్ వీవీవీ నాగేంద్రకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు, ప్రొఫెసర్ సునీల్ కుమార్, ప్రొఫెసర్ జీఎస్ కుమార్, జీహెచ్ బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.