కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు…

Hyderabad

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు
– పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
– ఈ పాస్ తప్పనిసరి
– వైద్య శాఖ సమన్వయంతో పగడ్బందీగా కరోనా కట్టడికి కృషి
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి

పటాన్ చెరు:

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. పోలీస్ పికెట్ వద్ద వాహనదారులకు పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో భాగంగా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో పర్యవేక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు అవుతుందని తెలిపారు. కొంతమంది చిన్న చిన్న పనులు అంటూ రోడ్లపైకి వస్తుండడంతో కరోనా కట్టడికి ఇబ్బందులు కలగడమే కాక వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందన్నారు. అన్ని జిల్లాలు కమిషనరేట్ లు అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరుస్తున్న ట్లు పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలతో పాటు వాహనాలు సీజ్. కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా ఈ పాస్ తీసుకోవాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం లో వైరస్ ను పూర్తిగా నిర్మూలించే విధంగా వైద్య శాఖతో సమన్వయం చేసుకొని కరోనా కట్టడికి పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. పారిశ్రామిక ప్రాంతాలలో పని చేసే పరిశ్రమల కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు తెలంగాణ ఈ పాస్ తో పాటు ఆయా రాష్ట్రాల ఈపాస్ లు తీసుకొని రావాలని ఈ పాసులు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైమ్ సీఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *