ఐదు మున్సిపాలిటీలో చెంప చెళ్లుమనిపించిన సిగ్గు రాలేదా
పదవులు, టిక్కెట్లు అమ్ముకునే నీచ చరిత్ర నీది
ప్రజల కోసమే సేవ చేసే తత్వం నాది
జిల్లా మంత్రి ఒత్తిడితోనే మా మీద అక్రమ మైనింగ్ కేసు
సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయని నువ్వా మా మీద మాట్లాడేది
కాటా ఆరోపించిన భూముల కబ్జా వట్టి మాటలే
ఒక గజం భూమి కబ్జా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే
అనవసర ఆరోపణలు చేస్తే గట్టి గుణపాఠం చెప్తాం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు పై, మూడు సార్లు ప్రజల మద్దతు తో గెలిచిన నా మీద మాట్లాడే స్థాయి కాటా శ్రీనివాస్ గౌడ్ కు లేదని ఇప్పటికైనా బట్టేబాజ్ మాటలు బంద్ చేసి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు పైన. తన పైన వ్యక్తిగతంగ చేసిన ఆరోపణలు ఖండిస్తూ మంగళవారం పటాన్ చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు పటాన్ చెరు నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చిత్తుగా ఓడిన కాట శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు పై మూడు సార్లు ప్రజల మద్దతుతో గెలిచిన నాపై ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీనీ ఓడించి ప్రజలు చెంపదెబ్బ కొట్టినట్టు గుణపాఠం చెప్పిన కాటా తీరులో మార్పు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు కార్యకర్తలకు బీ ఫామ్ లు అమ్ముకోవడంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి గ్రామానికి, మండలానికి, మున్సిపాలిటీలకు, డివిజన్లకు ఏజెంట్లను పెట్టుకొని బిల్డర్లు, పారిశ్రామికవేత్తల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడడం నిజం కదా అని ప్రశ్నించారు. పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని 40 లక్షలకు అమ్ముకున్నా విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు పెళ్లికి బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు . జిల్లా మంత్రి దామోదర ఒత్తిడితోనే అధికారులను పావులుగా వాడుకొని తన సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో ఇరికించారని ఆరోపించారు.

కోర్ట్ ఆదేశించిన రీసర్వే చేయట్లేదు
2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పటాన్ చెరు రెవెన్యూ పరిధిలోని లక్డారంలో సర్వేనెంబర్ 738 లో 15 ఎకరాల భూమిని క్రషర్ కోసం కేటాయించారన్నారు. అప్పటికే ఆ భూముల్లో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ ఆ భూముల్లో జాతీయ రహదారికి సంబంధించి కంకరణ మైనింగ్ నిర్వహించారని అదే స్థలాన్ని తమ సంతోష్ శాండ్ కంపెనీకి మైనింగ్ కి కేటాయించగా మేము అక్కడ క్రషర్ వ్యాపారం నిర్వహించామన్నారు. అయితే అప్పటికే ప్రోగ్రెస్ కంపెనీ మైనింగ్ నిర్వహించిన వాటా తేల్చకుండానే తమ పై మంత్రి దామోదర కక్ష కట్టి రాత్రికి రాత్రే 11 తప్పుడు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 38 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపిస్తూ పదిరెట్లు పెనాల్టీ వేసి 380 కోట్ల రాయల్టీ చెల్లించాలని అధికారులు ఆదేశించారని తెలిపారు. అయితే చివరకు 58 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.ఈ వ్యవహారంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించగా రీ సర్వే నిర్వహించి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేసిన మైనింగ్ లెక్క తేల్చాలని కోర్టు ఆదేశించిన అధికారుల పై ఒత్తిడి తెచ్చి సర్వే నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
భూకబ్జా ఆరోపణలు వట్టివే
పోచారం సర్వేనెంబర్ 62లో తమ కుటుంబ సభ్యులు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని భూమిని కబ్జా చేసి విక్రయించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. 1974 లో స్వాతంత్ర సమరయోధుల కోటా కింద సర్వే నంబర్ 62 లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఆ తర్వాత 1997 లో ఆ భూమిని ప్రేమ్ లాల్ అనే వ్యక్తికి అమ్మగా ఆ తర్వాత ఆ భూములను మరికొందరు కొని ప్లాట్లు చేసి ఇండ్లు నిర్మించి విక్రయించారని తెలిపారు. ఈ విషయంలో కాట నిజ నిజాలు నిర్ధారించకుండా ఆరోపణలు చేయడం ఆయన ఆవివేకానికి నిదర్శనమన్నారు.పార్టీలోని ఆనంద్ నగర్ లేఔట్ లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూముల్లో తమ ప్రమేయం లేకున్న తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అన్నారంలో 117 మంది రైతుల దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలను ఖండించారు. ఆ భూములు 81 మందికి సర్టిఫికెట్లు అందించామన్నారు.2001 నుంచి రాజకీయాల్లో ఉన్న తాను తన సొంత భూములను నమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నానని వెల్లడించారు. ఒక గజం స్థలం నేను కబ్జా చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
కుటుంబానికి న్యాయం చేయని నువ్వా మాట్లాడేది
సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ మా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత తల్లికి తిండి పెట్టకుండా, తోడబుట్టిన తోబుట్టువులను, అన్నా వదినలను మోసం చేస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పంచాయతీ పెట్టుకునే ఈ దుర్మార్గుడు ప్రజలకు సేవ చేస్తానని డైలాగులు కొట్టడం హాస్యాస్పదమన్నారు. సొంత కుటుంబ సభ్యులకు న్యాయం చేయని నువ్వు పటాన్ చెరు ప్రజలకు ఏం ఒరగబెడుతావని ప్రశ్నించారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకొని ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి పటాన్ చెరు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలికారు. మరొకసారి అవాకులు చేవాకులు మాట్లాడుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తే గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
