స్వీయ క్రమశిక్షణ విజయానికి సోపానం – ప్రేరణోపన్యాసంలో ఎన్ సీసీ క్యాడెట్లకు గీతం ప్రోవీసీ ఉద్బోధ

Districts Hyderabad Telangana

పటాన్‌చెరు:

స్వీయ క్రమశిక్షణ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి, స్వీయ నియంత్రణకు, ప్రతికూల పరిస్థితులలో కూడా సంయమనంతో వ్యవహరించడానికి ఉపకరిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఉద్బోధించారు. గీతం ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ -1) లో పాల్గొంటున్న ఎన్ సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రేరణోపన్యాసం చేశారు.

ఎన్ఎసీసీ నినాదమైన ఐక్యత, క్రమశిక్షణ గురించి వివరిస్తూ ఇవి జీవితంలో ఒక వ్యక్తి రాణించడానికి, వచ్చిన అవకాశాలను ఓ బృందంగా సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. సమష్టిగా ఉంటే సులువుగా లక్ష్యాలను సాధించవచ్చని ఆయన ఉద్బోధించారు. యువతలో ధైర్యం, సహృదయత, క్రమశిక్షణ, నాయకత్వం, లౌకిక దృక్పథం, సాహస స్ఫూర్తి, క్రీడా నెపుణ్యం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలను వృద్ధి చేయడానికి ఇటువంటి వార్షిక శిక్షణా శిబిరాలు ఉపకరిస్తాయని చెప్పారు.

 

సాయుధ దళాలతో సహా అన్ని రంగాలలో నాయకత్వం అందించడానికి, దేశ సేవ కోసం సదా సిద్ధంగా ఉండడానికి వ్యవస్థీకృత శిక్షణ, ప్రేరేపిత యువతగా మానవ వనరుల సృష్టికి ఎన్ సీసీ తోడ్పడుతుందన్నారు. ఐఐటీ మద్రాసులో పనిచేసేటప్పుడు భారత రక్షణ దళాలకు తాను అందించిన పలు సేవలను ఈ సందర్భంగా ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ థెరిస్సాలను ఉటంకిస్తూ పలు సందేశాలు, త్యాగ నిరతితో సహా సేవా దృక్పథం ఆవశ్యకతను ప్రొఫెసర్ శివప్రసాద్ వివరించారు.

సంగారెడ్డిలోని 33 వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కర్నల్ ఎస్.కె.సింగ్ అతిథిని సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ కేసర్ రాణా, పలువురు శిక్షకులు, ఎన్ సీసీ అనుబంధ అధికారులు, క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతు శిక్షణ ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *