– యువత డ్రగ్స్, మద్యానికి అలవాటు
-మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మనవార్తలు ,ఆమీన్పూర్
రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ రాక్షస పాలనను మహిళలతో కలిసి రూపుమాపుతామని, టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం బీరంగూడ గుట్టపై కౌన్సిలర్లు ఎడ్ల సంధ్య రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పాల్గొని మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని ఒక్క రోజు కాకుండా వారం రోజుల పాటు నిర్వహించుకోవాలని బీజేపీ నిర్ణయించిందని అందులో భాగంగా మహిళలతో ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడం పట్ల ఎడ్ల సంధ్య రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.
కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మారిందన్నారు. మద్యానికి బానిసలుగా మారి వావివరుసలు మరిచి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అధికమయ్యాయని వాపోయారు. తెలంగాణలో యువత డ్రగ్స్ కు అలవాటుపడడం, మద్యానికి బానిసై సమాజం చెడిపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
నేటి సమాజంలో మహిళలు ప్రతి రంగంలో వివక్షతకు గురవుతూనే ఉన్నారని, వివక్షతను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూపీ ఎన్నికల్లో అధికంగా మహిళలు వేసిన ఓట్ల ద్వారానే యోగి విజయం సాధించారన్నారు. తెలంగాణలోనూ మహిళల ప్రతాపం చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా జిల్లా ఇంచార్జీ జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్థన్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్ మాధురి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, నాయకులు గోదావరి అంజిరెడ్డి, జగన్, బైండ్ల కుమార్, సహదేవ్, శ్యామల, పద్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.