భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగాహాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని పేద, కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత నేత టంగుటూరి అంజయ్య అని కొనియాడారు. అంతటి గొప్ప వ్యక్తిని స్మరిస్తూ కిడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి. వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, క్రీడా పోటీల నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
