పటాన్‌చెరు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్ లు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఐపీఎస్ అధికారిణి, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు విస్తరణ డెరైక్టర్ నిధి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పౌర సమాజం స్వచ్ఛందంగా ముందుకొస్తే కలిసి పనిచేయడానికి తాము సదా సిద్ధమేనని చెప్పారు. ఏదైనా అమర్యాదకర ఘటన జరిగిన వెంటనే మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మహిళల భద్రత కోసం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులతో కేసీఆర్ ఒక కమిటీని వేశారని, 82 సిఫారసులలో భాగంగా ఏర్పాటయిన షీ టీమ్స్ నాయకత్వాన్ని తనకు అప్పగించినట్టు స్వాతి లక్రా చెప్పారు. ఉన్నతాధికారుల సహకారంతో చేపట్టిన ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్నానని, బాధిత మహిళ పోలీసు స్టేషన్ కు వచ్చే అవసరం లేకుండా వాట్సాప్, క్యూఆర్ కోడ్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనికి ఐసీసీ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడయిందన్నారు. ఫిర్యాదు నేపథ్యం, తగిన ఆధారాలు, సాంకేతిక సహకారంతో నమోదైన కేసులను త్వరగా పరిష్కరిస్తున్నా మని చెప్పారు.
ఇప్పటి వరకు దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయని, చాలావరకు పెట్టీ (చిన్న) కేసులేనని, తప్పులు పునరావృతం చేసే వారి సంఖ్య చాలా స్వల్వమేనని ఆమె స్పష్టీకరించారు. పలు నేరాలలో మైనర్లు నిందితులడం తమను కలచివేసిందని, తల్లిదండ్రుల సమక్షంలో వారిని కౌన్సెలింగ్ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందని, నేరాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడమే అందుకు నిదర్శనమని స్వాతి లక్రా వివరించారు. తమ గబృందాలు పలు కళాశాలలను సందర్శించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలు కూడా ఫలవంతమయ్యాయన్నారు.
మహిళలపై నమోదయ్యే కేసులలో గృహహింస కేసులే ఎక్కువని, తమకు ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే వాలంటీర్ల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహించి, పూర్వాపరాలు పరిశీలించి వాటిని నివారించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రాంచీలో జన్మించిన తన బాల్యం, చదువు, కుటుంబం, తల్లిదండ్రులు, వృత్తిని చేపట్టడం వంటి పలు అంశాల గురించి స్వాతి వివరించారు. తండ్రి కోరిక మేరకు తాను పోలీసు వృత్తిలోకి అడుగిడినా, ఆ వృత్తిని ప్రేమించడం ద్వారా రాణించినట్టు చెప్పారు. ఏ వృత్తిలోనైనా సవాళ్ళు సహజమేనని, వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోనాలన్నారు. పలు సందేహాలకు సందర్భోచిత జనాబులిచ్చి అకట్టుకున్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, ఐపీఎస్ అధికారి స్వాతిని సత్కరించారు.
ఇక చదవండి
వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టం కామిక్షి భాస్కర్ల
పవన్ కల్యాణ్… నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు!