అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అభిరుచికి తగ్గ కోర్సులను ఎంపిక చేసుకుని, అందులో రాణించి, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు సూచించారు. అవినాష్ కళాశాల కూకట్ పల్లి, ఎల్.బీ.నగర్, హయత్ నగర్, సికింద్రాబాద్ శాఖలకు చెందిన దాదాపు 750 మంది విద్యార్థుల బృందం శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించింది.ఆహ్లాదకరమైన వాతావరణంలో గీతం ప్రోవీసీ అవినాష్ విద్యార్థులను స్వాగతించి, ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు చెందిన అన్ని అంశాలను స్వయంగా పరిశీలించి కూలంకషంగా తెలుసుకోవాలని సూచించారు.
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా బీ-స్కూల్ గురించి లోతైన అవగాహన కల్పించారుచడమే గాక, అక్కడున్న బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాల గురించి వివరించారు. అవినాష్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆకట్టుకునే జవాబులిచ్చి వారిని ఉత్సాహపరిచారు. గీతం బీ-స్కూల్ ఎంబీ ఏ చివరి సంవత్సరం విద్యార్థులతో అవినాష్ బృందం ముఖాముఖి సమావేశమై, వివిధ కెరీర్ ఎంపికలు, భవిష్యత్తు అవకాశాల గురించి ప్రత్యక్ష జ్జానాన్ని అందించారు.ఆ తరువాత, కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె. మమత వారితో సమావేశమై, ప్రాంగణ నియామకాలు, దానికి సన్నాహకంగా గీతంలో ఇచ్చే శిక్షణ, దానిని విజయవంతంగా పూర్తిచేసుకుని వివిధ కంపెనీలకు ఎంపికైన వారు పొందుతున్న జీతభత్యాల వివరాలను తెలిపారు.
ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగిన గీతం సందర్శన, ముఖాముఖి చర్చలు, స్వయంగా పరిశీలించే వెసులుబాటు వంటివి అవినాష్ విద్యార్థులకు విస్తృతమైన అవగాహనను ఏర్పరచడమే గాక, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి తోడ్పడింది. దీనికి అదనంగా గీతంలోని బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన పలు ప్రయోగశాలలు, ఆకట్టుకునే ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సదుపాయాలు అవినాష్ విద్యార్థుల ఆసక్తిని రెట్టింపు చేశాయి. పసందైన విందుతో ముగిసిన ఈ పర్యటన, పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి చర్చించడంతో పాటు వారితో పరిచయాలు ఏర్పరచుకోవడానికి వీలు కల్పించింది.