పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రయోగశాలలో ఎలుకలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై ఫార్మసీ విద్యార్థులకు స్వీయ అనుభవం అత్యంత ఆవశ్యకమని హెదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్ బాబు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాలను బుధవారం ముఖ్య అతిథిగా ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించారు.ఈ సందర్భంగా ‘క్యాన్సర్ చికిత్స కోసం ఔషధ ఆవిష్కరణలో ఆధునిక పోకడలు’ అనే అంశంపై ప్రసంగించారు. క్యాన్సర్ పరిశోధన, మూల కణాలు, మూర్ఛ, మెదడులో కణితి రంగాలలో జంతు సరిశోధన ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. క్యాన్సర్ యొక్క సంక్లిష్ట స్వభావాన్ని నొక్కిచెబుతూ, ఇది జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా అసాధారణ, అనియంత్రిత పెరుగుదలను సంతరించుకుంటుందన్నారు. క్యాన్సర్ చికిత్సకు ఔషధాలు అందుబాబులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం నివారణ లేదన్నారు. వ్యక్తిగత జన్యుపరమైన వ్యత్యాసాలకు అనుగుణంగాఆయా రోగులను బట్టి చికిత్సను చేయాల్సి ఉంటుందని డాక్టర్ బాబు పేరొన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) యానిమల్ ఫెసిలిటీ పూర్వ సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.హరిశంకర్ వివిధ జంతు జాతుల (ముఖ్యంగా ఎలుకలు, కుందేళ్లు, మేక పిల్లలు, కుక్కలు, కోతులు) వివరణ, నిర్వహణలను విశదీకరించారు. సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.జె.ముహేష్ కుమార్, ఔషధ ప్రయోగాల కోసం బంతు నమూనాలను రూపొందించడం, జంతువుల ధోరణి, శస్త్రచికిత్సా విధానాలను వివరించారు. ఈ కార్యశాలలోపాల్గొన్న విద్యార్థులకు జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై అవగాహన కల్పించారు.
తొలుత, చక్కని శివభక్తి గీతంతో ప్రారంభమైన ఈ కార్యశాలలో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ రెండు రోజుల వర్క్షాప్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. బయోమెడికల్ పరిశోధన రంగంలో విద్యార్థులు రాణించడానికి అవసరమైన అనుభవాన్ని ఈ కార్యశాల ద్వారా అందిస్తున్నట్లు కార్యక్రను సమన్వయకర్త డాక్టర్ విన్కాస్ సుయాస పేర్కొన్నారు. ఫార్మసీ విద్యార్థులు. ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆహుతులందరినీ అలరించాయి.