_రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు.. నిధుల కేటాయింపు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోనే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, మైనార్టీ బంధు, బి సి బందు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇందులో ఎలాంటి సిఫార్సులకు తావులేదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళిత బంధు గృహలక్ష్మి మైనార్టీ బందు బీసీ బందు లాంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇంటింటి విచారణ తర్వాతే లబ్ధిదారు ఎంపిక చేయడం జరిగిందని గుర్తు చేశారు.
పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తిరిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా మిగులుతాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న పటాన్చెరు నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని తెలిపారు.అంగన్వాడి ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వేతనాలు పెంచుతూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారని తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు వెంటనే విరమించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి పాఠశాలలకు తాళాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, సంబంధిత ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పటాన్చెరు జాతీయ రహదారి నుండి పెద్దకంచెర్ల మీదుగా దౌల్తాబాద్ బ్రిడ్జి వరకు 18 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన స్పోర్ట్స్ కిట్లను అతి త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీడీవో బన్సీలాల్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
