_శాంతి భద్రతలో మేటి తెలంగాణ పోలీస్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు విభాగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అన్నారు. ప్రధానంగా పోలీసు శాఖపై ప్రజలకు మంచి అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రారంభించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలు పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు వీలు ఏర్పడిందని అన్నారు. ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుని తెలంగాణ పోలీస్ దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే హాక్‌ఐ, లాస్ట్ రిపోర్టు, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూ.పోలీసుల సేవలు పొందుతున్నారని తెలిపారు.
మరో పక్క క్షేత్రస్థాయిలో ఉండే పెట్రోలింగ్ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో నేరం జరిగితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణమే చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పడిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సంస్థాగతపరంగా పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, వేలాది పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం రక్తదానం చేసిన యువకులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి భీమ్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు కుమార్, వినాయక రెడ్డి, డి ఐ లల్లు నాయక్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మెరాజ్ ఖాన్, సందీప్, సునీల్ రెడ్డి, రామకృష్ణ, యువకులు పాల్గొన్నారు.