కెసిఆర్ నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు , పటాన్ చెరు:
ప్రపంచంలోని అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, శాంతి సహనం ప్రేమతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలు సంతోషకరంగా నిర్వహించుకోవాలన్న ఉన్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కులం మతం వర్గం తేడా లేకుండా అన్ని మతాల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2001 నుండి తాను స్వయంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోని ప్రతి చర్చికి క్రిస్మస్ కేక్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏసు క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయం అన్నారు. నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ చర్చిల ఫాదర్లు, పాస్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం అందించిన క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రియాంక, ఎంపీపీలు దేవానందం, సుష్మ శ్రీ వేణుగోపాల రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ఆయా మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.