పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశంలోని వివిధ ఫౌండేషన్లు, పరిశోధనా సంస్థల నుంచి గీతం అధ్యాపకులకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.భరణి చంద్రకుమార్ కు లోపాలను అధిగమిస్తూ, తప్పును తట్టుకుని నీటి అడుగున ప్రయాణించే వాహన నమూనా రూపకల్పన కోసం ఐఐటీ గౌహతి సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ (ఐఐటీజ్-టీఐడీఎఫ్) రూ.11 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు తెలిపారు. అదే స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్కు రేకుల కదలికతో నీటి అడుగున నడిచే వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం గౌహతి సాంకేతిక అవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ రూ.10 లక్షల గ్రాంటును మంజూరు చేసిందన్నారు. దీనికి అదనంగా, స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని ఫెనాన్స్ విభాగం ప్రొఫెసర్ ఎం. జయశ్రీకి భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి ఓ నమూనాతో పర్యావరణ, సమాజం, పరిపాలన (ఈఎస్), సంస్థ పనితీరుపై అధ్యయనం చేయడానికి గాను భారత విద్యా మంత్రిత్వ శాఖ ఐసీఎస్ఎఎస్ఆర్ ద్వారా రూ.8 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు ఆయన నెల్లడించారు.విశిష్ట విజయాలతో పాటు పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ భరణి చంద్ర కుమార్, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్, ప్రొఫెసర్ జయశ్రీలను వీసీ అభినందించారు.