మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జె. వెంకట రమణా రెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘విశ్లేషణాత్మక పద్ధతుల ద్వారా ఔషధ పదార్థాలలో జన్యు విష మలినాలను అంచనా’ వేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్రబాబు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రమణారెడ్డి చేసిన పరిశోధన, ఫార్మాస్యూటికల్ సమ్మేళనాలలో అతి తక్కువ స్థాయిలో ఉండే జన్యు విషపూరిత మలినాలను – అంటే డీఎన్ఏను దెబ్బతీసి, తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగించే పదార్థాలను – గుర్తించడానికి, అధునాతన, సున్నితమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు.
ICH M7 మార్గదర్శకాల వంటి ప్రపంచ నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా, ఈ అధ్యయనం ఆర్మోడాఫినిల్, కోలెసెవెలామ్ హైడ్రోక్లోరైడ్ వంటి కీలక ఔషధాలను విశ్లేషించడానికి గ్యాస్ క్రోమాటోగ్రఫీ- మాస్ స్పెక్ట్రోమెట్రీ (జీసీ-ఎంఎస్), అయాన్ క్రోమోటోగ్రఫీ (ఐసీ) వంటి అధునాతన పద్ధతులను వినియోగిస్తుందని తెలియజేశారు. ఈ పరిశోధన అత్యున్నత కచ్చితత్వం, విశ్వసనీయతను నిర్ధారిస్తూనే, సరళమైన, పర్యావరణ హితమైన పద్ధతులకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.ఈ అధ్యయనం ఔషధ నాణ్యత నియంత్రణను గణనీయంగా బలోపేతం చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ఔషధ అభివృద్ధి పద్ధతులకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
డాక్టర్ వెంకట రమణా రెడ్డి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
