వేగవంతంగా రామప్ప సుందరీకరణ : పురావస్తు శాస్త్రవేత్త

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్ చెరు:

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రామప్ప దేవాలయం సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని , దానితో పాటు చార్మినార్కు కూడా కొత్త సొబగులద్దుతున్నట్టు పురావస్తు శాఖ హెదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ తెలియజేశారు . గీతం స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ , హ్యుమానిటీస్ ( జీఎస్చ్ఎస్ ) ఆధ్వర్యంలో ‘ భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాల ప్రాముఖ్యత ‘ అనే అంశం సోమవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ పరిధిలో ఆ శాఖ సాధించిన అభివృద్ధి , వస్తున్న సానుకూల ఫలితాలను ఆమె వివరించారు . బహుళ విభాగాలతో కూడిన పురవస్తు శాఖకు ఇంజనీరింగ్ , కెమిస్ట్రీ , హిస్టరీ వంటి పలు రంగాలకు చెందిన యువ ఔత్సాహికుల అవసరం ఉందని చెప్పారు . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలుగా మారడానికి భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ విద్యావకాశాలను ఆమె వివరించారు .

నీటి అడుగున సదుపాయం , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ( జీఐఎస్ ) , జియోగ్రాఫిక్ పెనెట్రేటింగ్ రాడార్ ( జీపీఆర్ ) , ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి సరికొత్త సాంకేతికతలు విద్యార్థులలో ఉత్సుకతను రేకెత్తించాయి . మనదేశంలో 52 ఆర్కియాలజీ మ్యూజియాలు , ఆరు త్రవ్వకాల కేంద్రాలున్నట్టు ఆమె చెప్పారు . మొదటి రాతి యుగం నుంచి నియోలిథిక్ కాలం చివరి దశ వరకు పాలియోలిథిక్ రాతి ఆయుధాలను డాక్టర్ స్మిత , ఆమె బృందం ప్రదర్శించారు . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్న కార్యకలాపాలు , యాత్రలు , వాటి ప్రక్రియలను వివరించారు . జీఎస్చ్ఎస్ అధ్యాపకులు డాక్టర్ వి.వి. అభిలాష్ , డాక్టర్ పూజా రెస్ట్రాలు ఈ కార్యశాలను సమన్వయం చేశారు . హ్యుమానిటీస్లోని వివిధ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు , అధ్యాపకులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *