మనవార్తలు ,పటాన్చెరు:
రేడియో ఐసోటోప్లు , నియంత్రిత రేడియేషన్లను పంటల మెరుగుదల , ఆహార సంరక్షణ వంటి వాటికి వినియోగిస్తున్నట్టు భాభా అణు పరిశోధనా సంస్థ ఫుడ్ టెక్నాలజీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎస్.గౌతమ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్‌షాప్‌లో గురువారం ఆయన ‘ వ్యవసాయం , ఆహార ఉత్పత్తుల సంరక్షణలో రేడియో ఐసోటోప్లు , రేడియేషన్ సాంకేతికత వినియోగం’పై వర్చువల్‌గా ఉపన్యసించారు . వ్యవసాయ , ఆహార ఉత్పత్తుల సంరక్షణకు అయోనెజింగ్ రేడియేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు . మన దైనందిన జీవితంలో వినియోగించే అనేక ఉత్పత్తులు రేడియేషన్ నుంచి ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందినట్టు ఆయన చెప్పారు . రేడియేషన్ ద్వారా కొన్ని రోజుల పాటు కొన్ని ఆహార పదార్థాల షెల్ప్ జీవితాన్ని పొడిగించడం వల్ల అవి పాడెపోకుండా ఉంటాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు .

ఆహార వికిరణం సుదీర్ఘ షెల్ప్ జీవితంలో సురక్షితమై ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు . కొన్ని విత్తనాలు , తయారుగా ఉన్న ఆహారాన్ని సున్నితంగా రేడియేషన్‌కు గురిచేయడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చని ఆయన తెలిపారు . మనదేశంలో వాషి – నవీ ముంబై నాసిక్‌లోని లాసల్గావ్లో రెండు కర్మాగారాలు ఉన్నాయని , ఈ రెండు సుగంధ ద్రవ్యాలు , ఉల్లిపాయలు , పండ్ల ప్రాసెసింగ్ కోసం రేడియేషన్ సేవలను అందిస్తున్నట్టు డాక్టర్ గౌతమ్ పేర్కొన్నారు .
గత 30 ఏళ్ళగా రేడియేటెడ్ ఫుడ్స్‌ని పరీక్షిస్తున్నా , అటు జంతువులకు కానీ , ఇటు మానవులకు గానీ ఎలాంటి హానికరమైన ప్రభావాలు కనిపించలేదని ఆయన చెప్పారు . ఈ నేపథ్యంలో సాధారణ వినియోగం కోసం కొన్ని రేడియేషన్ ఆహారాలు విడుదలవుతున్నట్టు డాక్టర్ గౌతమ్ తెలియజేశారు . రేడియేషన్ సేవలు అందించాలని అభిలషించే ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ సౌకర్యం కల్పిస్తోందని , వ్యక్తులుగా లేదా సహకార సంఘాలుగా ఏర్పడి పరిశ్రమలను నెలకొల్పవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు . డాక్టర్ గౌతమ్ తరఫున బార్క్ నుంచి వచ్చిన డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీకి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు జ్ఞాపికను అందజేశారు
