_ఉన్నత విద్యావంతుల బోధన.ఇంగ్లీష్ మీడియంలోను తరగతులు.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం
_అద్భుతమైన ఫలితాలు సాధించాలి
_తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభం
మనవార్తలు , అమీన్పూర్:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కోట్లాది రూపాయలు కేటాయించడం జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తాండ, దయార, వడక్ పల్లి, సుల్తాన్ పూర్ గ్రామాల్లో విస్తృత పర్యటన చేశారు.
పటేల్ గూడా గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం, ఐలాపూర్ లో అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం, వడక్ పల్లి లో తెలంగాణ క్రీడా ప్రాంగణం, సుల్తాన్ పూర్ గ్రామంలో ఒక కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ను ఆయన ప్రారంభించారు. ఐలాపూర్, దయార గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం సుల్తాన్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి మండలంలో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా టోర్నమెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లోనూ బోధించేందుకు ఈ విద్యాసంవత్సరం నుండే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దేవానంద్, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ మల్లీశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు నితీషా శ్రీకాంత్, మల్లేష్, భాస్కర్ గౌడ్, కుర్మ నర్సమ్మ, లలితా మల్లేష్, రాజు, ఎంపిటిసి లు, మండల విద్యాశాఖ అధికారి పీ పి రాథోడ్, పంచాయతీరాజ్ డీ ఈ సురేష్, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.