మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ పేపర్లో ప్రకటనలకే పరిమితమవుతుంది. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గత సెప్టెంబర్ నుండి బిల్లులు మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులే తమ సొంత డబ్బులతో విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారని ప్రభుత్వం ఇప్పటిదాకా నిధులను మంజూరు చేయకపోవడంపై ఆమె ఆగ్రాన్ని వ్యక్తం చేశారు.
గతంలో నాలుగు రూపాయలు ఉన్న గుడ్డు ధర నేడు ఐదు నుండి ఆరు రూపాయలు ఉందని ఇప్పటివరకు గుడ్డు రేటు విషయంలో ప్రభుత్వం పెంచిన జీవనం అమలు చేయడం లేదని అందుకు అనుగుణంగా ఎక్కడ నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. చివరికి పిల్లలకు ఇచ్చే బియ్యం సైతం నాసిరకంగా ఉంటున్నాయని వీటివల్ల పిల్లల తల్లిదండ్రులు కార్మికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. వీటన్నిటిపై వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కొంగర కృష్ణ ముదిరాజ్, సువర్ణ, రాములు, షేక్ నస్రిన్, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.