విజయవంతంగా ముగిసిన ప్రమాణ-2025

Telangana

-అలరించిన సాంకేతిక-సాంస్కతికోత్సవాలు

– విద్యార్థులలో మిన్నంటిన కోలాహలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక-సాంస్కృతికోత్సవాలు ఆదివారం నిర్వహించిన ఈడీఎం – డీజే నైట్ తో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొనడమే గాక, బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకున్నారు.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్.రూపేష్, ఆత్మీయ అతిథిగా పాల్గొన్న SYNYCS గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు శ్రహంజ్ ప్రమాణ-2025ను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, విద్యార్థులను ఉన్నతాశయాల వైపు ప్రేరేపించేలా ప్రసంగించారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలు కార్యశాలలు, ఆటో ఎక్స్ పో. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ తో పాటు వివిధ పోటీలు, ర్యాంప్ వాక్, నృత్యాలు, పాటల పోటీలను నిర్వహించారు. ఇవన్నీ విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఉపకరించాయనడంలో సందేహం లేదు. కళాకారుల ప్రతిభా ప్రదర్శన విభాగంలో నికితా గాంధీ, మంగ్లీ తమ హుషారు పాటలతో ప్రేక్షకులను మంత్రమగ్ధులను చేశారు.

ఇక చివరి రోజు ప్రపంచ ప్రసిద్ధ జూలియా బ్లిస్, పీఆర్ వో బ్రదర్స్ యొక్క అద్భుతమైన ఈడీఎం- డీజే నైట్ ప్రదర్శనతో ప్రమాణ-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి గమనాన్ని కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు.

 

గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి త్రినాథరావు, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధి రాహుల్ మండల్, పలువురు అధ్యాపకులు, ప్రమాణ కోర్ కమిటీ సభ్యులు ఈ వేడుకలను పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తయ్యేలా కృషిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *